కునుకు లేకుండా చేస్తోంది
Microsoft: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొమ్ములు తిరిగిన కంపెనీలు కూడా దీని బారిన పడుతున్నాయి. భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు సైతం ఇదివరకే దశలవారీగా లేఆఫ్స్ ప్రకటించాయి.మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధపడుతోంది. సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా లేఆఫ్స్ ను ప్రకటించవచ్చని తెలుస్తోంది. దీనిపై బ్లూమ్ బర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం- ఈ విడతలో కూడా మైక్రోసాఫ్ట్ వేల సంఖ్యలో ఉద్యోగాల్లో కోత పెట్టవచ్చు.ముఖ్యంగా సేల్స్ డివిజన్ లో తాజా లేఆఫ్స్ ఉండొచ్చు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించనప్పటికీ- అమెరికా ఆర్థిక సంవత్సరం ముగింపు అంటే- జూన్ 30వ తేదీ నాటికి ఉద్యోగుల తొలగింపు, పునర్వ్యవస్థీకరణ చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది మే నెలలో సుమారు 6,000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థకు ఉన్న మానవ వనరులతో పోల్చుకుంటే ఇది సుమారు మూడు శాతం. దీని తరువాత మరో భారీ లేఆఫ్ ఇదే అవుతుంది. మే నెలలో చోటు చేసుకున్న తొలగింపులు- ఇంజినీరింగ్, కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్ వంటి వివిధ విభాగాలపై ప్రభావం చూపాయి. గత ఏడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్ లో పని చేసిన ఉద్యోగుల సంఖ్య సుమారు 2,28,000. గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. సంస్థలోని అతిపెద్ద విభాగాలలో ఒకటిగా ఉన్న సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో 45,000 మంది ఉద్యోగులు పని చేస్తోన్నారు. ఆపరేషన్స్-86,000, ప్రొడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్- 81,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0