సావిత్రినగర్ లో విషాదం - రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి- మరొకరికి తీవ్ర గాయాలు
కాకినాడ జిల్లా,తాళ్లరేవు మండలం, మహి న్యూస్ ( సెప్టెంబర్ 23) :
అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకోగా, మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మండల పరిధిలోని గాడిమొగ పంచాయతీ పెదవలసల గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొక యువకునికి తీవ్రగాయాలయ్యాయి. కోరంగి ఎస్ఐ పి.సత్యన్నారాయణ, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సావిత్రి నగర్‌కు చెందిన మచ్చా లక్ష్మీ సతీష్ (20), పాలెపు కాసురాజు (21)లు స్పోర్ట్స్ బైక్ పై అతివేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో లక్ష్మీ సతీష్, కాసురాజులు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్‌పై వెనుక కూర్చున సావిత్రినగర్ గ్రామానికి చెందిన మరొక యువకుడు ఇళ్లంగి మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన మణికంఠను తాళ్లరేవు సామాజిక ఆస్పత్రికి తరలించగా ప్రాధమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కోరంగి ఎస్ఐ సత్యన్నారాయణ, సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యన్నారాయణ తెలిపారు. ఇలా ఉండగా రోడ్డుపై అకస్మాత్తుగా పెద్ద శబ్దం వచ్చిందని వచ్చి చూడగా సంఘటనా స్థలంలో యువకులు మృతి చెంది ఉన్నారని స్థానికులు తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0