శ్రీకాకుళం, మహి న్యూస్, మార్చి 31 :  విద్యార్ధుల చదువులకు మరిన్ని నైపుణ్యాలు అందివ్వాలనే లక్ష్యంతో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన ఓ ఆలోచన ఫలితాలను అందిస్తోంది. కేంద్ర మంత్రిగా తనకు అందుబాటులోకి వచ్చిన పరిచయాలను జిల్లా అభివృద్ధికి వినియోగిస్తున్నారు. తాజాగా పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ నాయుడుతో భేటి అవ్వడం.. వారి కార్పోరేట్ సామజిక భాద్యత నిధులు జిల్లాకు వినియోగించాల్సిందిగా రామ్మోహన్ నాయుడు కోరడం.. మంగళవారం నాడు ఈ నిధుల వినియోగంకు సంబంధించి శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయం నుండి పరిపాలనా ఆమోదం రావడం చకచకా జరిగిపోయాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంస్థ నుండి సి.ఎస్.ఆర్ నిధులు 30 లక్షల రూపాయలు వచ్చాయని.. వీటిని శ్రీకాకుళం నగరంలోని ఎన్.టి.ఆర్ మున్సిపల్ హైస్కూల్ తో పాటు, నిమ్మాడ జిల్లా పరిషత్ హైస్కూల్ లలో స్కిల్ ల్యాబ్ లను ఏర్పాటు చెయ్యాలని, ఒక్కో పాఠశాలలో 15 లక్షల వ్యయంతో మొత్తంగా ముప్పై లక్షలను వీటి నిర్మాణం కోసం వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలను సర్వశిక్షా అభియాన్ అధికారులకు జారీ చేశారు. వీటితో పాటుగా కాగ్నో స్పేస్ అనే సంస్థ.. ఈ రెండు ల్యాబ్ ల నిర్వహణ చేస్తూ.. విద్యార్ధులకు మరిన్ని నైపుణ్యాలు తోడయ్యేలా చెయ్యాలని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ రెండు పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ స్కిల్ ల్యాబ్ లు సేవలందిచనుండగా.. భవిష్యత్ లో మరిన్ని పాఠశాలలకు ఈ కాన్సెప్ట్ ను విస్తృత పరిచే ఆలోచన చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 

కాగా గతంలో శ్రీకాకుళం నగరంలోని ఎన్టిఆర్ మున్సిపల్ హైస్కూల్ ను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు.. ఈ పాఠశాలను తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో అక్కడ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయి అదనపు భవనాలు, ఇతర వసతుల కోసం నిధుల మంజూరు జరగగా.. నిర్మాణ దశను ఆవి పూర్తి చేసుకున్నాయి. తాజాగా వాటితో పాటు స్కిల్ ల్యాబ్ సౌకర్యం కూడా అందుబాటులోకి రావడం పట్ల ఇటు ఎన్టిఆర్ మున్సిపల్ స్కూల్ విద్యార్ధులు, నిమ్మాడ జెడ్పి హైస్కూల్ విద్యార్ధులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దొరికిన ప్రతీ అవకాశాన్ని జిల్లా అభివృద్ధి వైపు మళ్లిస్తూఉండటంలో కేంద్ర మంత్రి చొరవ పట్ల ప్రసంశలు లభిస్తున్నాయి.