అద్దంకి, మహి న్యూస్, మార్చి 27 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా తామే చేశామని చెప్పుకోవడం జగన్‌మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీకి నిదర్శనమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. అద్దంకిలో శుక్రవారం పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా జే. పంగలూరు మండలం రామకూరు గ్రామంలో పర్యటించిన ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావుతో పాటు టీడీపీ సీనియర్ నేత కీ.శే. గోకనకొండ రామలింగస్వామి విగ్రహాలను ఆవిష్కరించారు. అక్కడే దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిల్డ్రన్స్ పార్క్‌ను ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రూ.31 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రారంభించారు. అదే గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహ్మద్ వలి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును మంత్రి అందజేశారు.
కొరిశపాడు మండలం కుర్రావానిపాలెం పర్యటనలో భాగంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రూ.3.85 కోట్లతో ఏర్పాటు చేయబోయే రక్షిత తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. కుర్రావానిపాలెం నుంచి తక్కెళ్లపాడు వరకు రూ.40 లక్షలతో నిర్మించిన తారు రోడ్డుతో పాటు, కుర్రావానిపాలెంలో రూ.10 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రారంభించారు.
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఏం నష్టపోయారు, కూటమి ప్రభుత్వంలో ఏం లబ్ధి పొందారో వారికి తెలుసని అన్నారు. పేదల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి జగన్‌కు ఐదేళ్లు పట్టిందని విమర్శించారు. ఒకే సంతకంతో సంక్షేమ పెన్షన్‌ను వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా ‘సూపర్ 6’ను కూడా సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
రెండేళ్లలో ఒక్క రూపాయి విద్యుత్ చార్జీ కూడా పెంచకుండా 13 పైసలు ట్రూ డౌన్ చేశామని తెలిపారు. ఏపీ ఈఆర్సీ ఆదేశాల ప్రకారం ప్రజల నుంచి వసూలు చేయాల్సిన సుమారు రూ.18 వేల కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. కూటమి చేసిన ప్రతి మంచి పనినీ తామే చేశామని చెప్పుకోవడం జగన్‌కు అలవాటుగా మారిందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ నేనే తెచ్చానని, కియా ప్లాంట్ మా నాన్న తెచ్చాడంటున్న జగన్, స్వాతంత్ర్యం కూడా మా తాతే తెచ్చాడని చెబుతాడంటూ ఎద్దేవా చేశారు. కూటమి చేస్తున్న అభివృద్ధిని మేమే చేస్తున్నామని గుండెలపై చేయి వేసుకుని ధైర్యంగా చెబుతామని అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఏడు సబ్‌స్టేషన్ల నిర్మాణంతో పాటు అనేక ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే సంక్షేమం, అభివృద్ధితో మంచి జరుగుతుందో గమనించాలని కోరారు.
అద్దంకి నియోజకవర్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాతల సహకారంతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. జే. పంగలూరు మండలం రామకూరు పాఠశాలకు చెందిన 115 మందికి, కొరిశపాడు మండలం పి. గుడిపాడు పాఠశాలకు చెందిన 18 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పదివేలకు పైగా సైకిళ్లను విద్యార్థులకు ఉచితంగా అందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పూర్తి స్థాయిలో సైకిళ్లను అందించామని తెలిపారు. మిగిలిన విద్యార్థులకు కూడా ఏప్రిల్ నెలలో పరీక్షలు పూర్తయ్యే సమయానికి సైకిళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






Be the first to comment.