విజయనగరం, మహిన్యూస్, మార్చి 16:
కన్యకా పరమేశ్వరి కోవెల వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి విజయనగరంలో ఆయన జయంతి కార్యక్రమం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, ఇప్పిలి రామారావు, టీవీ దుర్గారావు, బూర ఐశ్వర్య యాదవ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే అని కొనియాడారు. సత్యం, అహింసా, గాంధేయవాద మార్గంలో పైయినించి కుల మతాలకు అతీతంగా పోరాటం చేశారని తెలిపారు. అంటరానితనం అనుమానసం అని భావించి దళితవాడలో ఇంటింటా భోజనం చేసేవారని తెలిపారు. దేవాలయాల్లో దళితుల ప్రవేశం కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తెలుగువారికి జరిగే అన్యాయం మీద గొంతెత్తి పోరాడిన మహా నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తెలుగు వారి పట్ల మద్రాసీలు అనుసరించిన హేళన, అవమానాలకు వ్యతిరేకంగా తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని కోరుతూ ఆమరణ దీక్ష చేయడం జరిగిందని తెలిపారు. పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఫలితంగా ఆయన చనిపోయిన తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉండాలనే అంశం మీద పార్లమెంటులో చర్చ జరిగి మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగిందని తెలిపారు. అలాంటి మహనీయుని త్యాగాలను, సేవలను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుతెరగాలని అన్నారు. పొట్టి శ్రీరాములు జ్ఞాపకాలను గుర్తుగా ప్రతి జిల్లాలో స్మారక కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పి.షణ్ముఖరావు, లాయర్ కరీం, పి.మీనాక్షి, లక్ష్మణరావు, శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు.





Be the first to comment.