కడప, మహి న్యూస్ మార్చి 16 : ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలితం ప్రతి తెలుగువారందరికీ స్ఫూర్తిదాయకం అని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్లోని సభాభవన్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సంస్మరణ సభ డిఆర్వో విశ్వేశ్వర నాయుడు అధ్యక్షతన జరిగింది.
** ఈ సందర్భంగా డిఆర్వో మాట్లాడుతూ.. అప్పట్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం వరుసగా 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి, చివరికి జాతి కోసం ప్రాణాలర్పించిన మహనీయులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. దేశంలోని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన మన తెలుగువారని చెప్పుకోవడం గర్వకారణం అన్నారు. అంతటి మహోన్నత, స్వాతంత్య్ర సమరయోధులు శ్రీ అమరజీవి త్యాగాన్ని ఈ రోజు తెలుగువారందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
** కార్మిక సంక్షేమ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ... మన దేశ స్వాతంత్ర్యం కోసం గతంలో ఎంతోమంది ప్రాణాలర్పించారన్నారు. జాతి గౌరవం కోసం వారి జీవితాలను ఫణంగా పెట్టిన మహనీయుల సేవలను మననం చేసుకుంటూ, ఈ తరం సమాజానికి స్ఫూర్తిని ఇచ్చేటందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి సంస్మరణ సభలను నిర్వహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు.
** గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్ మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం.. ప్రత్యేక రాష్ట్రం కావాలని గాంధేయ మార్గంలో పోరాటం చేసి ప్రాణాలర్పించిన అమర జీవి త్యాగాన్ని ఈ తరం యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 1930 సంవత్సరంలో సత్యాగ్రహంలో పాల్గొని ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించారన్నారు.
దృఢ సంకల్పం, ఉన్నతాశయం, అకుంఠిత కార్యదీక్ష, నిబద్ధత, సమయ స్ఫూర్తి... వంటి అత్యున్నత విలువలకు అమరజీవి పొట్టి శ్రీరాములు నిలువెత్తు నిదర్శనం అన్నారు. విధినిర్వహణలో ప్రతి ఉద్యోగికి ఆయన అత్యున్నత విలువలు స్ఫూర్తిదాయకం అన్నారు.
కార్యక్రమంలో ముందుగా.. జ్యోతి ప్రజ్వలన, అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి డీఆర్వోతో పాటు పలువురుపూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు వక్తలు అమరజీవి త్యాగనిరతిని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎస్డీసిలు వెంకటేశ్వర్లు, రంగస్వామి, అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ లోని అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, పలువురు సంఘ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.









Be the first to comment.