శ్రీకాకుళం, మహి న్యూస్, మార్చి 17 : జిల్లాలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని, ఇన్వెంటరీ అప్డేషన్, స్కానింగ్ ప్రక్రియలో ఎటువంటి అలసత్వం వహించరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిజిటలైజేషన్ ప్రక్రియకు సంబంధించిన ఐదు విడతల షెడ్యూల్‌ను జేసీ వివరించారు.
మొదటి విడతలో 2016-19 మధ్య గల ఇళ్ల స్థలాల రిజిస్టర్, డీకేటీ, ఏఆర్సీ రికార్డుల స్కానింగ్‌ను ఈ నెల 12 నాటికి పూర్తి చేయాలన్నారు. రెండో విడతలో భాగంగా సీలింగ్, సెటిల్మెంట్ 2016కు పూర్వపు ఇళ్ల స్థలాల రిజిస్టర్ల అప్‌లోడింగ్‌ను మార్చి 31 నాటికి ముగించాలని సూచించారు. ఏప్రిల్ మాసంలో మూడు, నాలుగు విడతల కింద దేవదాయ, వక్ఫ్ బోర్డు భూములతో పాటు భూ సేకరణ రికార్డుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. చివరి విడతలో భాగంగా 10-1 రిజిస్టర్, మాన్యువల్ అడంగల్స్, మాన్యువల్ 1బి రిజిస్టర్ల డిజిటలైజేషన్‌ను ఏప్రిల్ 27న ప్రారంభించి మే 30 నాటికి సంపూర్ణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రికార్డుల భద్రత, ఖచ్చితత్వం విషయంలో తహసీల్దార్లు వ్యక్తిగత పర్యవేక్షణ చేయాలని, సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్విరాజ్ కుమార్, డిఆర్ఓ ఎస్వీ లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ రెవెన్యూ అధికారులు సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.








Be the first to comment.