కడప, మహి న్యూస్ మార్చి 16 : రెవెన్యూ సమస్యల పరిష్కార ప్రాధాన్యత తోపాటు.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా.. చేపట్టిన "రైతన్నా మీకోసం" కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని జేసీ డా. నిధి మీనా సంబంధిత అధికారులకు సూచించారు.

సోమవారం కలెక్టరేట్ లోని సభా భవన్ హాలులో  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి జేసీ డా. నిధి మీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సందర్భంగా పిజిఆర్ఎస్ కార్యక్రమానికి హాజరైన  అధికారులతో జేసీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పిజిఆర్ఎస్ వ్యవస్థ ద్వారా అర్జీదారులకు సంతృప్తి కరమైన, నాణ్యమైన వేగవంతమైన పరిష్కారాన్ని అందిస్తోందన్నారు. ప్రభుత్వ ఆశయానికి కట్టుబడి ప్రతి శాఖ జిల్లా అధికారితో పాటు ఆయా శాఖల మండల స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. 

భూ వివాదాల శాశ్వత, సమగ్ర పరిష్కారానికి  పిజిఆర్ఎస్ సేవలతో పాటు ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ప్రత్యేక కౌంటర్ల ద్వారా జిల్లా నలు మూలల నుండి వచ్చిన పలువురు అర్జీలను రెవెన్యూ అధికారులు స్వీకరించి.. సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. 

*"రైతన్నా మీకోసం" వారోత్సవాలను విజయవంతం చేయండి...*

ఈ నెల 16 వ తేదీ నుండి ఈ నెల 25 వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతతో నిర్వహిస్తున్న "రైతన్నా మీకోసం" వారోత్సవాలను జిల్లాలో అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు సేవా కేంద్రాలలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా, రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతోందన్నారు. 

ఈ కార్యక్రమం ద్వారా ఖరీప్ సీజన్ లో సాగు పద్ధతుల పై అవగాహన, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికత, మరియు రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారన్నారు. 

అలాగే వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై.. ఆయా శాఖల అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్ శాఖలు.. ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్డీసిలు వెంకటేశ్వర్లు, రంగస్వామి, కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్, ఎంప్లాయిమెంట్ అధికారి సురేష్ కుమార్, గ్రౌండ్ వాటర్ డిడి మురళీధర్, అన్ని శాఖల జిల్లా అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.